POLICE| డ్రగ్స్–సైబర్ క్రైమ్ పై అవగాహన..

POLICE| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో కేఎల్ యూనివర్సిటీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద జూనియర్ కాలేజ్‌కు చెందిన దాదాపు వెయ్యిమంది విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్పీ, 1 టౌన్, 2 టౌన్, క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, యువత ప్రవర్తనలో జాగ్రత్తలు వంటి అంశాలపై వివరించారు. పోలీసులు ప్రదర్శించిన PPT స్లైడ్స్, వీడియోలు విద్యార్థుల్లో లోతైన అవగాహన కలిగించాయి.

డీఎస్పీ సాయినాథ్ డ్రగ్స్ వలన శరీరానికి, మెదడుకు, కుటుంబానికి జరిగే భయంకర పరిణామాలను వివరించారు. డ్రగ్స్ మెదడు పనితీరును దెబ్బతీస్తాయని, జ్ఞాపకశక్తి తగ్గి నిర్ణయశక్తి కోల్పోతుందని చెప్పారు. హృదయ సమస్యలు, లివర్ వైఫల్యం, ఊపిరితిత్తుల దెబ్బతినడం వంటి తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒకరి వ్యసనం కుటుంబం మొత్తం ఆర్థిక–సామాజికంగా దెబ్బతింటుందని ఉదాహరణలతో వివరించారు. డ్రగ్స్ నేరాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర మొబైల్, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడకంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. తెలియని లింకులు, ఫిషింగ్ మెసేజెస్, OTP మోసాలు, నకిలీ ప్రొఫైల్స్‌పై హెచ్చరించారు.

చిన్న తప్పిదం కూడా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, నంబర్లు సోషల్ మీడియాలో పబ్లిక్ చేయరాదని సూచించారు. 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య విద్యార్థి జీవితంలో మంచి ప్రవర్తన, సరైన సంబంధాలు, నిర్ణయాల ప్రాధాన్యత గురించి మాట్లాడారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనం యువతను లక్ష్యాలనుంచి దూరం చేస్తుందని, తమ చుట్టూ ఉన్న వారు భవిష్యత్తును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు వినయం, క్రమశిక్షణ పాటించి సమస్యలను తల్లిదండ్రులతో పంచుకోవాలని సూచించారు. క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తల్లిదండ్రులు–పిల్లల మధ్య రోజువారీ సంభాషణ ముఖ్యమని చెప్పారు.

పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఒత్తిడులు గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు. తాజాగా పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్టు’ సైబర్ మోసం గురించి హెచ్చరిస్తూ, పోలీసులు ఎప్పుడూ ఫోన్‌లో అరెస్ట్ చేయరని, డబ్బులు అడగరని స్పష్టం చేశారు. డ్రగ్ వ్యసనం ప్రారంభ లక్షణాలు గమనించిన వెంటనే సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విస్తృత స్పందనను రేపగా, భవిష్యత్‌లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply