ఉయ్యూరులో దారుణం..

ఉయ్యూరులో దారుణం..
ఉయ్యూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సాయి కృప దంత వైద్యశాలలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దంత వైద్యం అందించాల్సిన చోట కనీస పరిజ్ఞానం లేని స్వీపర్లు డాక్టర్ల అవతారమెత్తి రోగులను నరకయాతనకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పిప్పిపన్ను నొప్పితో బాధపడుతూ ఒక బాధితురాలు ఈ ఆసుపత్రిని ఆశ్రయించారు.
అక్కడ ఉన్న ఒక స్వీపర్ డాక్టరులా ఫోజులిస్తూ, పన్ను పీకడానికి ఏకంగా 3000 రూపాయల ఫీజు వసూలు చేసింది. అనంతరం బాధితురాలని కుర్చీలో కూర్చోబెట్టి, ప్లాస్ (పట్టకారు)తో పన్ను పీకబోయి, పొరపాటున నాలుకను గట్టిగా లాగే ప్రయత్నం చేసింది. దీంతో బాధితురాలు నొప్పితో విలవిలలాడుతూ హాహాకారాలు చేసింది. ఈ అమానుషం పై బాధితులు అక్కడి సిబ్బందిని నిలదీయగా, సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగారు. బాధితుల మెడ పట్టుకుని బలవంతంగా ఆసుపత్రి బయటకు గెంటివేస్తూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని గురువారం రాత్రి తెలిపారు.
వైద్యురాలి నిర్లక్ష్యం: – ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న దంత వైద్యురాలి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. “ఆమె జీతం ఆమె సంపాదించుకోవాలి కదా” అంటూ స్వీపర్‌ను సమర్థించడం అక్కడున్న వారిని విస్తుపోయేలా చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్లు, అనధికార చికిత్సల పై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
