Asia Cup T20 Super Four | పాక్‌పై భారత్ ఘన విజయం..

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టీ20 సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై గెలుపొందింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ టీమ్ ఇండియా 18.5 ఓవర్లలోనే 174/4 స్కోరు చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇది టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత జట్టు సాధించిన అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, పాకిస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 39 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు.
అయితే, కెప్టెన్ సూర్య డకౌట్ అవ్వడం కాస్త నిరాశపరిచింది. చివర్లో తిలక్ వర్మ 19 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ సంజు 17 బంతుల్లో 13 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 7 బంతుల్లో 7 పరుగులు చేసి తిలక్ తో పాటు నాటౌట్‌గా నిలిచాడు.
పాకిస్థాన్ బ్యాటింగ్ & భారత బౌలింగ్…
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 15 పరుగుల వద్ద 2.3 ఓవర్లకే మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. సాహిబ్జాదా ఫర్హాన్ – సైమ్ ఆయుబ్ కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని శివమ్ దూబే బద్దలు కొట్టాడు.
ఫీల్డింగ్ కొన్ని పొరపాట్లు, క్యాచ్ డ్రాపులు జరిగినప్పటికీ… భారత బౌలర్లు కొన్ని కీలక వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ హుస్సేన్ తలత్ (10) వికెట్ తీశాడు. తర్వాత శివమ్ దూబే, సాహిబ్జాదా ఫర్హాన్ (58)ను అవుట్ చేసి పాకిస్థాన్‌కు భారీ దెబ్బ కొట్టాడు. చివర్లో మహ్మద్ నవాజ్ (21) సూర్యకుమార్ చేతిలో రనౌట్ అయ్యాడు.
