గ్రామాభివృద్ధికై కృషి చేస్తాను…

గ్రామాభివృద్ధికై కృషి చేస్తాను…
- ఆష్టా సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్
ముధోల్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధికై కృషి చేస్తానని ఆష్టా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ను సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం మరియు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు మురికికాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలు చేపట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడంతో పాటు, గ్రామం వెలుపల రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలని తీర్మానించారు.
వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి కలగకుండా లీకేజీలను అరికట్టి, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. సామాజిక రుగ్మతలైన బహిరంగ మద్యపానం, జూదాన్ని గ్రామంలో పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందేలా, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఎత్తు పెంపు, పాత విద్యుత్ స్తంభాల తొలగింపుపై చర్చించారు. అలాగే వివో , అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాధర్ సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు
