సూర్య చంద్రులు ఉన్నంత వరకు..

సూర్య చంద్రులు ఉన్నంత వరకు..

మక్తల్, ఆంధ్రప్రభ – తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రస్థానంలో అపూర్వమైన ముద్ర వేసిన కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” సృష్టికర్త అందెశ్రీ (64) ఈరోజున కన్నుమూశారు. ఆయన మరణం బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులోని లాలాగూడలో నివసిస్తూ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే గీతం “జయ జయ హే తెలంగాణ” ద్వారా అందెశ్రీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర అధికార గీతంగా ఆయన రచన ఎంపిక కావడం, ఆ గీతం ప్రతి తెలంగాణవాడి మనసులో మమేకమైపోవడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవమని మంత్రి పేర్కొన్నారు. ఆయన సాహిత్యం పై మక్కువ పెంచుకుని కవిత్వం, పాటల ద్వారా తెలంగాణ ప్రత్యేకత, భాష, సంస్కృతి, గౌరవాన్ని ప్రపంచానికి చాటారని మంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రతి తెలంగాణ వాది గుండెల్లో అందెశ్రీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అందెశ్రీ మరణం చాలా బాధాకరమని.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

Leave a Reply