Arrest | ప్రేమ పేరుతో..

Arrest | ప్రేమ పేరుతో..

Arrest, గుంటూరు, ఆంధ్రప్రభ : ప్రేమ పేరుతో ఓ యువతిని వెంటాడుతూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో సయ్యద్ జుబేర్ అహ్మద్ (25) అనే యువకుడికి 7 నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో నివాసముంటున్న బాధితురాలిని అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ అహ్మద్ అనే యువకుడు ఆమె కాలేజీకి వెళ్లేటప్పుడు తరచూ వెంబడించడం, అడ్డుకోవడం, ప్రేమ పేరుతో వేధించడం వంటి చర్యలకు పాల్పడేవాడు. యువతి కుటుంబ సభ్యులు మందలించినా అతడి వేధింపులు ఆగలేదు. అంతేకాకుండా, తన ప్రేమను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు ఆమెను బెదిరించేశాడు. దీంతో, 2019 డిసెంబర్ 24వ తేదీన సాయంత్రం సుమారు 7 గంటలకు బాధితురాలు పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై (SI) మేరాజ్ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు పై విచారణ జరిపిన మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి M. జగదీశ్వరి నవంబర్ 18, 2025న తుది తీర్పును వెలువరించారు. నిందితుడు దోషిగా తేలగా, 7 నెలల సాధారణ జైలు శిక్ష మరియు ₹3,000 జరిమానాను శిక్షగా విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సౌరి వాదనలు వినిపించారు. మహిళల పై జరిగే నేరాలను గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తుందని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply