Arrest | ముగ్గురు దొంగల అరెస్టు

Arrest | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కీలక పురోగతి సాధించారు. చిత్తూరు జిల్లా పోలీసు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 61 కిలోల కాపర్ వైరు, నేరానికి ఉపయోగించిన పరికరాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలోని కాణిపాకం, ఐరాల, పెనుమూరు, గంగాధర నెల్లూరు, ఎస్.ఆర్.పురం, పూతలపట్టు, ఎన్.ఆర్.పేట, చిత్తూరు తాలూకా పరిధిలో రాత్రి వేళల్లో వరుసగా 97 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లను అపహరిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మార్గదర్శకత్వంలో, చిత్తూరు ఉప విభాగ పోలీసు అధికారి సాయినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

దర్యాప్తులో లభించిన సమాచారం మేరకు జనవరి 30 సాయంత్రం టానా కూడలి వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 61 కిలోల కాపర్ వైరు (విలువ రూ.85,400), కటింగ్ పరికరాలు మరియు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానానికి హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. అరెస్టయిన నిందితులు పులిచర్ల బాలకృష్ణ రెడ్డి (42), పులిచర్ల చంద్రబాబు (39), పి. గణేష్ (35)గా గుర్తించారు.
వీరిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే సుమారు 29 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం దొంగతనాల ద్వారా సుమారు 1000 కిలోల కాపర్ వైర్ అపహరించినట్లు అంచనా. ఈ కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
