- కదిరిలో అరబిక్ హోటల్ సీజ్
- కుళ్లిన చికెన్, మటన్ తో వంటకాలు
- అధికారుల తనిఖీలో విస్తూపోయే నిజాలు
(ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఒక అరబిక్ రెస్టారెంట్‌లో ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ నిర్వాహకుడు ఇంతియాజ్ కుళ్లిన చికెన్, మటన్ ముక్కలను వంటకాలలో వాడుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. రంగులతో వంటకాలు తయారు చేస్తూ రాజకీయ నాయకుల అండతో హోటల్ నిర్వాహకుడు రెచ్చిపోతున్నాడు.
హోటల్లో నాణ్యత సరిగా లేదని డజన్ల కొద్దీ ఫిర్యాదులు అందిన తర్వాత, అధికారుల బృందం అకస్మాత్తుగా హోటల్‌పై దాడి చేసింది. ఈ దాడుల్లో అధికారులు హోటల్ గురించి షాకింగ్ విషయాలను కనుగొన్నారు.
హోటల్లో తిని వదిలిన చికెన్ మటన్ ముక్కలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్రత ప్రదేశంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంచి గడువు తీరిన మసాలాను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.
కుళ్ళిన చికెన్, మటన్ చూసి నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిక్ రెస్టారెంట్ ను సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు.