APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం..

APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం..
APPSC l కర్నూలు ఆంధ్ర పభ్ర: ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఏపీపీఎస్సీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డిఆర్వో వెంకట నారాయణమ్మ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో డిఆర్వో సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ కి సంబంధించి ఏపీ ఫారెస్ట్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (మెయిన్స్), థానేదార్, ఏపీ ఎండో మెంట్స్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–II వ్రాత పరీక్షలను ఆఫ్‌లైన్ విధానం, OMR ఆధారిత (ఆబ్జెక్టివ్ టైప్) రూపంలో నిర్వహించనున్నట్లు డిఆర్వో తెలిపారు. కర్నూలు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. మొత్తం 9,958 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు..
సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా బ్యాకప్, తాగునీటి సౌకర్యం, కూర్చునే ఏర్పాట్లు, అలాగే APPSC మార్గదర్శకాలను కఠినంగా పాటించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని డిఆర్వో ఆదేశించారు.ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉదయం 8.00 నుండి 8.45 గంటల వరకు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 నుండి 1.45 గంటల వరకు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో 2.00 గంటల వరకు జరుగుతాయని, గ్రేస్ పీరియడ్ ముగిసిన తరువాత ఎవరినీ అనుమతించరని తెలిపారు. పూర్తి పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరూ పరీక్ష హాలును విడిచిపెట్టరాదని తెలిపారు.
టాబ్లెట్లు, ఐప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు, హ్యాండ్‌బ్యాగులు, కాగితాలు, పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ డిజిటల్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు (ఏ విధమైనవి అయినా) సమాచారాన్ని నిల్వ చేయగల, పంపగల, స్వీకరించగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి తీసుకురావడం నిషేధం అని తెలిపారు. కేవలం అనలాగ్ చేతి గడియారాలు మాత్రమే అనుమతించబడతాయన్నారు. అంధత్వం, లోకోమోటర్ వైకల్యం (రెండు చేతులు ప్రభావితమైన వారు – BA) సెరెబ్రల్ పాల్సీ వర్గానికి చెందిన బెంచ్‌మార్క్ వైకల్యాలున్న అభ్యర్థులకు అవసరమైతే స్క్రైబ్, రీడర్, ల్యాబ్ అసిస్టెంట్ సౌకర్యం కల్పించబడుతుందన్నారు.
అదనంగా, పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం కలెక్టరేట్, కర్నూలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (ల్యాండ్‌లైన్ నెం. 08518-277305) కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని డిఆర్వో తెలిపారు. సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివరాముడు, కల్లూరు, కర్నూలు రూరల్ కర్నూలు అర్బన్ మండలాల తహసీల్దార్లు, పోలీస్,ఇతర శాఖల తో పాటు ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు
