AP | నవతర మేధస్సుకు క్వాంటం–డీప్‌టెక్ ఆవిష్కరణలు

AP | నవతర మేధస్సుకు క్వాంటం–డీప్‌టెక్ ఆవిష్కరణలు

ఎన్‌ఆర్‌ఐ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : నవతరం మేధస్సు అభివృద్ధికి క్వాంటం సాంకేతికత, డీప్ టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇవి భవిష్యత్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారనున్నాయని ప్రొఫెసర్ కె. చిదానంద గౌడ స్పష్టం చేశారు. ఆగిరిపల్లిలోని ఎన్‌.ఆర్‌.ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థా కళాశాల (ఆర్ట్స్ అండ్ సైన్స్) కంప్యూటర్ సైన్స్ విభాగం సంయుక్తంగా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), న్యూఢిల్లీ వాణి పథకం కింద రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.

AP

నవ తరం మేధస్సు కొరకు క్వాంటం కృత్రిమ మేధస్సు డీప్ టెక్‌లో సంకేతిక ఆవిష్కరణలు అనే అంశంపై ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 38 విద్యాసంస్థల నుంచి 52 పరిశోధనా పత్రాలు సమర్పించగా, 128 మంది అధ్యాపకులు, పరిశోధకులు, పీజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. సదస్సును ఉద్దేశించి ప్రొఫెసర్ చిదానంద గౌడ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ భారీ నిధులు కేటాయిస్తోందన్నారు.

కంప్యూటింగ్, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ శాస్త్రం, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో క్వాంటం టెక్నాలజీ విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్నారు. సంప్రదాయ కృత్రిమ మేధస్సును మించి, తదుపరి తరం మేధస్సు రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలను పూర్తిగా తెలుగులోనే గ్రంథరూపంలో ప్రచురించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి అంతర్జాతీయ ప్రమాణ సంఖ్య కూడా లభించిందని వెల్లడించారు. ఇది ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యను విస్తరించడంలో కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వాణి (ఆవిష్కరణకు ఉత్సాహం, అభివృద్ధికి తోడ్పాటు) పథకం లక్ష్యం భారతీయ భాషల్లో సాంకేతిక జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడమని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌.ఆర్‌.ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ ఆర్. వెంకట రావు, సంస్థ సీఈఓ మోటూరి తేజసాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. నాగ భాస్కర్, పీబీ సిద్ధార్థా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, కన్వీనర్ ఎన్. లలిత్ ప్రసాద్, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కె.వి. సాంబశివ రావు, కోఆర్డినేటర్ డాక్టర్ డి. సునీత, కో-చైర్మన్ డాక్టర్ టి.ఎస్. రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో విస్తరించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు విద్యార్థులు, యువ పరిశోధకులకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply