ఆరేళ్ల తర్వాత కవులకు ఉగాది ఊరింత
వేలాదిగా వచ్చిన దరఖాస్తులు
న్యాయ నిర్ణేతల ఫలితాలపై రాష్ట్ర సృజనాత్మకత మీమాంశ
కవులు, రచయితల ఎదురుచూపులు
ఉలుకు పలుకులేని సర్కారు
పైరవీలకే పెద్దపీట ప్రచారం..
కులాల కొలమానం, కవులకూ తప్పని పార్టీ రంగులు
మంత్రుల సిఫార్సులు సరేసరి
సాంస్కృతిక శాఖపై సర్వత్రా ఆగ్రహం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉగాది అంటేనే కవుల పండుగ. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలతో సంబరాలు అంబరాన్నంటుతాయి. గత ఐదేళ్లుగా కవులు, రచయితలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో సాహితీ వేత్తల్లో నిరాశ. నిశ్పృహలు అలుముకున్నాయి. కూటమి ప్రభుత్వం రావడంతో కవుల కలాలకు కొత్త కళ వచ్చింది. కవుల ఆశల నెరవేర్చేలా ప్రభుత్వం కూడా ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఆరేళ్ల నిరీక్షణలకు ప్రభుత్వ ప్రకటన కవుల్లో కొంగొత్త ఉత్సాహాన్ని నింపింది. వేలాది మంది తమ రచనలు, అర్హతలను ఉదహరిస్తూ సాంస్కృతిక శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ సాహిత్య రచయితలు ఈ అవార్డుల కోసం అర్జీలు పెట్టుకున్నారు.
కళారత్న, ఉగాది విశిష్ట పురస్కారాలు
కూటమి ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 72 మందికి కళారత్న(హంస) అవార్డులు, 100 మందికి విశిష్ట ఉగాది పురస్కారాలను అందించనుంది. ఇప్పటికే ఈమేరకు బడ్జెట్ కూడా విడుదల చేయడంతో విజయవాడలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకునేందుకు కవులు, రచయితలు భారీగానే పోటీ పడుతున్నారు. అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులూ వచ్చాయి. సుమారు 4 వేలకు పైగా దరఖాస్తులు చేరినట్టు సమాచారం.
సిఫార్సుల వెల్లువ…
ప్రతిభ కొలమానంగా ఇవ్వాల్సిన ఈ పురస్కారాలు, అవార్డులు కేవలం సిఫార్సు లేఖలు ఉంటేనే పరిగణనలోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ ఉన్నతాధికారుల సిఫార్సులతో కూడిన లేఖలను దరఖాస్తులకు జత చేసి పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నవారికే అవార్డులు ప్రకటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కళారత్న అవార్డులకు ఎంపిక చేసిన వారికి సెల్ ఫోన్ లో సమాచారం చేరవేశారు. ఉగాది పురస్కార విజేతల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంట ల వరకు విజయవాడ, ఇతర ప్రాంతాల్లోని కవులకు ఎవరికి కూడా ఎటువంటి సమాచారాన్ని సృజనాత్మక, సంస్కృతి సమితి ప్రతినిధులు అందజేయలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
కులాలు..పార్టీలే కొలమానం
ముఖ్యంగా అవార్డులు, పురస్కారాల ఎంపికలో కులాలు, పార్టీలను కూడా జోడించినట్లు తెలిసింది. ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ అంటూ, ఒక సామాజిక వర్గం అంటూ ఇలా పలు సమీకరణలు చేసి మరీ అవార్డులకు ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక రుగ్మతలకు అస్త్రాలను సంధించే కవులకు సైతం కులం, పార్టీ రంగులు అద్దడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటన ఎప్పుడు?…
ఉగాది సంబరాలు మరికొన్ని గంటల్లోనూ ప్రారంభం కానున్నాయి. అయినా ఇప్పటివరకు ఎటువంటి సమాచారాన్ని కవులకు పంపకపోవడంతో దూర ప్రాంతంలో ఉన్నవారు విజయవాడ వచ్చేందుకు నానా పాట్లు పడాల్సి ఉంటుంది. ఒకరోజు ముందుగా ప్రకటించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో మధ్యాహ్నానికి కూడా ప్రకటన వెలువరించలేదు. పురస్కారాలకు దరఖాస్తు చేసినవారంతా తమకు వస్తోందో లేదోనంటూ ఆవేదనతో ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ సంకల్పం బాగున్నా అధికారుల నిర్లక్ష్యం కవులు, సాహితీ వేత్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.