వెలగపూడి – ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది.ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాకనం, కంప్యూటరీకరణ, ఇతర పనులు కూడా పూర్తి చేసుకొని ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టెన్త్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ఇవాళ వెల్లడించారు. ఈసారి వాట్సాప్ లోనూ ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. ఈ నెల 23న బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆన్ లైన్ లో విడుదల చేసే ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉండబోతున్నాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు.
అభ్యర్థులకు ఫలితాలు
https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/
వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ ఎస్ సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల పిడిఎఫ్ కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. ఈ ఏడాది మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరి జవాబు ప్రశ్నాల మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేశారు. అనంతరం ఫలితాల కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేసారు. అనంతరం ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు ఎల్లుండి అందుబాటులోకి తెస్తున్నారు.