AP |ద‌మ్ముంటే జ‌గ‌న్ ఇంటి ముందు చేయండి పోరుబాట‌

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో విద్యార్థుల జీవితాలను సర్వ శాసనం చేసిన జగన్ ఇంటి ముందు పోరుబాట వైసీపీ బ్యాచ్ పోరుబాట నిర్వ‌హించాల‌ని తెలుగుయువ‌త రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు స‌వాల్ విసిరారు. విజ‌య‌వాడ‌ గురునాన‌క్ రోడ్డులోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి పోరుబాట పోస్టర్ ను విడుదల చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఫీజు రీయింబర్సుమెంటు, వసతి దీవెన సకాలంలో చెల్లించని జగన్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఐదేళ్లలో గుర్తుకు రాని రీఎంబర్సుమెంటు, వసతి దీవెన జగన్‌కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చాయా అంటూ మండిప‌డ్డారు. గతంలో ఉన్న ఫీజు రీఎంబర్సుమెంటును విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా పథ‌కాన్ని సృష్టించిన‌ట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకుని విద్యార్థుల గొంతుకోశాడ‌న్నారు.

గతంలో విద్యార్థుల తరుపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేద‌ని, కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచారార్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల‌ను, వారి తల్లితండ్రుల‌ను మోసం చేశాడ‌న్నారు. అవి కూడా సకాలంలో వారి ఖాతాల్లో వేయ‌క‌పోవ‌డంతో కళాశాల యాజమన్యాలు విద్యార్థుల‌ను వేధింపుల‌కు గురిచేశాయ‌న్నారు. కొన్నిచోట్ల హాల్ టిక్కెట్లు నిలిపివేసి, పరీక్షలు రాయనియ్య‌కుండా విద్యార్థుల‌ను వేధించిన‌ప్పుడు వారి ఆర్త‌నాదాలు జ‌గ‌న్‌కు వినిపించ‌లేదా అంటూ మండిప‌డ్డారు.

2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్సుమెంటు ఇస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించాడ‌న్నారు. విద్యాదీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేసిన నీచుడు జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.

2021-22 4వ క్వార్టర్‌ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం నోటీసు ఇచ్చి పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజామా కాదా అని ప్ర‌శ్నించారు. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీఎంబ‌ర్సుమెంటు నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్‌ నోటీసు అందింది నిజామా కాదా అన్నారు.

ఫీజు రీఎంబర్సుమెంట్‌ రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.989 కోట్లు, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టి, అందినకాడికి దోచుకుని బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని నీఛ‌రాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్‌రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాల‌ని ర‌వినాయుడు ధ్వ‌జ‌మెత్తారు. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్సుగా మారిన జగన్ నీతి మాటలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంద‌న్నారు.

ఫిబ్రవరి నెలలో ఫీజు పోరు విఫ‌ల‌మ‌వ‌డంతో మళ్లీ ఇప్పుడు యువత పోరు అంటూ డ్రామాలు మొదలు పెట్టాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదేళ్ల‌లో ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్లబకాయిలు పెట్టిన నువ్వు కాదా అసలు 420 జగన్ రెడ్డి అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీఎంబర్సుమెంట్ బకాయిలు విడుదల చేసింద‌ని, వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంద‌ని మీడియాకు వెల్ల‌డించారు.

విద్యార్థులను ఫీజుల‌ కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలిచ్చామ‌ని, 2024 జనవరిలో విడుదల చేయాల్సిన ఫీజు రీఎంబ‌ర్సుమెంటు బకాయిలను జగన్ ఇవ్వకుండా ఎగ్గొడితే విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆ బకాయిలను విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నార్నారు. వైసీపీ నేత‌ల‌కు ఏమాత్రం ద‌మ్ము,ధైర్యం ఉన్నా బ‌కాయిలు ఎందుకు పెట్టావ‌ని జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌శ్నించాల‌ని, జ‌గ‌న్‌రెడ్డి ఇంటిముందు ధ‌ర్నాకు దిగాల‌ని పిలుపునిచ్చారు.

అంతేకాని ప్ర‌భుత్వాన్ని నిందించే ప్ర‌య‌త్నాలు చేస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. విద్యార్థుల భ‌విష్య‌త్తుకు కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, జీవో నెంబ‌రు 77ను ర‌ద్దుకు, జీవో నెంబ‌రు 117, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. పాత ఫీజు రీఎంబ‌ర్సుమెంటు విధానం అమ‌లుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తిప‌క్షం కుయుక్తుల‌ను విద్యార్థులు, యువ‌త కూడా గ‌మ‌నించాల‌ని, స్వార్థ‌రాజ‌కీయాల‌కు బ‌లికావొద్ద‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుయువత అధ్య‌క్షుడు షేక్ నాగూర్‌, ఏలూరు జిల్లా తెలుగుయువ‌త అధ్య‌క్షుడు రెడ్డి చందు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గం తెలుగుయువ‌త అధ్య‌క్షుడు రాళ్ల‌పిల్లి మాధ‌వ‌, పోలవ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుయువ‌త నాయ‌కులు గ‌న్నిన సురేంద్ర‌నాథ్‌చౌద‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *