AP | టిడిపి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు …. ఎన్టీఆర్ విగ్ర‌హానికి చంద్ర‌బాబు పుష్పాంజ‌లి

గుంటూరు – తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇక‌ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ , పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు..

రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, ఎన్టీఆర్‌ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ.. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరుగగా 6 సార్లు అధికారంలో… 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది.

ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారం..

తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్‌ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్‌ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన.. తిరిగి నెలరోజులకే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అనేక పథకాలు..

ఎన్టీఆర్‌ పాలనలో రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిహక్కు, కరణాలు, మునసబు, పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయే. ఎన్టీఆర్‌ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం, మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనతా టీడీపీ సొంతం. మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనా ఈ పార్టీదే. 1985లో ఆ కార్పొరేషన్‌ను స్థాపించారు.

Leave a Reply