భూమల వివాదంపై 12 వారాలలో నివేదిక ఇవ్వాలని ఆదేశం
న్యూ ఢిల్లీ – కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం పెరుగుతుంది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అనంతరం కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు.
కొల్లేరు ప్రాంతంలో 5వ కాంటూరు పరిధిలో ఉన్న ఆక్రమణలు తొలగించి సరస్సు సరిహద్దులు నిర్ధారించాలంటూ 2008లో సుప్రీం ఆదేశించినా.. అమలు చేయకపోవడంతో కాకినాడకు చెందిన మృత్యుంజయరావు అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు, సహజ సిద్ధ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండరాదని.. కొల్లేరులో ఉన్న వాస్తవ పరిస్థితులను నివేదిక ఇవ్వాలంటూ గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. 2006 తర్వాత ఆక్రమణలూ తొలగించామని, తిరిగి ఆక్రమణలు చోటు చేసుకోవడంతో వాటిని తొలగించే పనిలో ఉన్నట్టుగా స్పష్టం చేసింది. ఇదే సమయంలో +5 కాంటూరు పరిధికంటే అదనంగా భూములు ధ్వంసం చేశారని, ప్రైవేటు, జిరాయితీ భూములకు పరిహారం చెల్లించకుండానే ధ్వంసం చేశారని భూ యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఇంప్లీడ్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్‌గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కొల్లేరులో క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటి?, +5 కాంటూర్ పరిధిలో జిరాయితీ భూములు ఉన్నాయా?, కొల్లేరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించినప్పుడు దాని పరిధిలోకి వచ్చే పైవేటు జిరాయితీ భూముల హక్కులను చట్టపరంగా నిర్ధారించారా? లేదా? అన్నదానిపై 12 వారాల్లోపు నివేదికఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా వేసింది.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు గ్రామాల ప్రజలకు ఊరట లభించినట్లు అయింది. దశాబ్దాల కాలంగా తమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. కొల్లేరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించినప్పుడు దాని పరిధిలోకి వచ్చే పైవేటు జిరాయితీ భూముల హక్కులను చట్టపరంగా నిర్ధారించారా? లేదా? అనే విషయంపై లోతైన అధ్యయనం జరిగితే అక్కడ నష్టపోయిన జిరాయితీ భూముల సాగుదారులకు, ప్రైవేటు భూముల యజమానులకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు.