స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన ఎపి మంత్రి అనగాని
ఎవరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం
తొలి విడతగా జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రార్ కార్యాలయాలలో
నెలాఖరు నాటికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో సేవలు
వెలగపూడి – ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘పరిపాలనా విధి విధానాలు అందరికి అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వ్యాపారస్థులు, బిల్డర్లు అందరూ స్టేక్ హోల్డర్లుగా ఉండే రెవెన్యు శాఖలో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు జరిగింది. ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేస్కోవచ్చు. అమ్మకదారులు, కొనుగోలుదారులు, సాక్షులు.. ఇలా అందరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం’ అని తెలిపారు.
290 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో….
’26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. 290 కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవసరం ప్రభుత్వానికి లేదు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకువస్తున్నాం. పారదర్శకంగా ఉండడం కోసమే మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నాం. భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాము. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి తగ్గేలా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా స్లాట్ విధానం అమలులోకి తేస్తున్నాము’ అని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు.