AP | బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్ … డ‌మ్మీ తుపాకుల‌తో వ్యాపారిపై అటాక్‌

ఓ వ్యాపారి ఇంట్లోకి చొర‌బ‌డ్డ దుండ‌గులు
డమ్మీ తుపాకులతో పెద్ద ఎత్తున‌ కాల్పులు
చిన్న‌పాటి గాయాలతో తప్పించుకున్న యజమాని
గ్యాంగ్ లోప‌ల ఉండ‌గానే తలుపులకు తాళం
రంగంలోకి దిగిన ఆక్టోపస్ టీమ్‌లు
చాకచక్యంగా నలుగురు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ పట్టివేత
మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మ‌రం
రెండున్నర గంటల ఆపరేషన్ సక్సెస్

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరులోని ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి ప్లాన్ వేశారు. అయితే అది కాస్త విక‌టించ‌డంతో అడ్డంగా పోలీసుల‌కు దొరికిపోయారు. కాగా, డమ్మీ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి ఆ వ్యాపారిని భయపెట్టే క్రమంలో దుండగుల ప్లాన్ రివర్స్ అయ్యింది. ముంబ‌యి గ్యాంగ్ స్టర్‌ల‌ తరహాలో ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను ఇంటి యజమానే బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఆక్టోపస్ టీమ్‌లు ఆ ఇంటిని చుట్టిముట్టాయి. సుమారు రెండున్నర గంటలపాటు చేప‌ట్టిన ఆపరేషన్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల అదుపులో డెకాయిట్ టీమ్..

చిత్తూరు గాంధీరోడ్డు.. లక్ష్మీటాకీస్ సమీపంలోని ఐడీబీఐ బ్యాంకు ఎదుట ఓ మినీవ్యాన్ ఆగింది. అందులో నుంచి దొంగల ముఠా పుష్ప కిడ్స్‌ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించింది. రెండు తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. రబ్బరు బుల్లెట్లతో గాయపడిన చంద్రశేఖర్ దొంగలను తోసుకుని బయటకు వచ్చి తలుపులు మూసి తాళం వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి నుంచి వచ్చిన ఆక్టోపస్ టీమ్ గాంధీనగర్ లోని చంద్రశేఖర్ ఇంటిని చుట్టుముట్టారు. రెండున్నర గంటల పాటు టెన్షన్ కొనసాగింది. ఆ చుట్టుపక్కల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. చివ‌రికి నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకేముందీ అసలు కథ కీలక మలుపు తిరిగింది. ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం ఈ దొంగాటకు సూత్రధారి అని తేలింది. సుబ్రహ్మణ్యం ఇటీవల అప్పుల పాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులను తప్పించుకునేందుకు ఈ దోపిడీ ప్లాన్ చేశారు. చిత్తూరు, అనంతపురం, నంద్యాలకు చెందిన ఆరుగురితో డెకాయిట్ టీమ్ ఏర్పాటు చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన ఎస్పీ..

తాజా ఘ‌ట‌న‌తో పోలీసులు చుట్టుముట్టటంతో సుబ్రహ్మణ్యం ప్లాన్ బెడిసి కొట్టింది. మరోవైపు కాల్పులు జరిగిన ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయడానికి వచ్చారా, లేక హత్య చేసే కుట్ర జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు ఘటనా స్థలికి చేరుకుని పరిస్తితిని పర్యవేక్షించారు. కాల్పులు జరిగాయని తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల జనం గాంధీరోడ్డులోని లక్ష్మి సినిహా హాల్ వద్ద ద‌గ్గ‌రికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కాసేపు అక్కడ సినిమా సీన్ లాంటి రియల్ సీన్లు కనిపించాయి. పోలీసులు, స్పెషల్ ఫోర్స్ బలగాలు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *