AP | కదిరి మున్సిపాలిటీలో అవిశ్వాసం సెగ

*ఏప్రిల్ 23న అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక భేటీ
*26 మంది కౌన్సిలర్లు సంతకాలు
*అధికార టీడీపీ వైపే వైసీపీ కౌన్సిలర్ల చూపు
*రంగంలోకి వైసీపీ వ్యూహం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమలోని కదిరి మున్సిపాలిటికీ అవిశ్వాసం సెగ రగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ పరికి నజీమున్నీసా పై ఈనెల 23వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానం కోరుతూ ఇప్పటికే 26 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి, జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈనెల 23వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని దీంతో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. కాగా అవిశ్వాస తీర్మానం విషయాన్ని జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ దృష్టికి వైసీపీ కదిరి నియోజకవర్గ ఇన్​చార్జ్ బీఎస్ మక్బూల్ అహ్మద్ తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ మన పార్టీకి సంబంధించిన చైర్​పర్సన్​ పదవిని మనకే దక్కాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

కౌన్సిల్లో బలాబలాలు…
కదిరి మున్సిపల్ పరిధిలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికలలో 30 స్థానాలలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఒక వైసీపీ రెబల్ మహబూబ్ బాషా స్వతంత్ర అభివృద్ధిగా గెలిచారు. ఐదుగురు టీడీపీ తరఫున గెలిచారు. 2024 ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇందులో వైసీపీ రెబల్ కౌన్సిలర్ సైతం ఉన్నారు. దీంతో టీడీపీ బలం కౌన్సిల్లో 12 కు పెరిగింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభావం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వైసీపీలోని మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీ వైపు వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ ఎన్నికలు అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ ల మార్పులకు సంబంధించి అనేక సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఓ నిర్ణయం తీసుకున్నారు. 26 మంది కౌన్సిలర్లతో అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు సేకరించి, కలెక్టర్​కు అందజేశారు. దీంతో ఈనెల 23వ తేదీన అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

చైర్ పర్సన్ సీటుపై వైసీపీ దృష్టి
అధికార టీడీపీ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి ముందుకు రావటంతో వైసీపీ నాయకులు తర్జనభర్జనలు చేసి, విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ తగిన బాధ్యత తీసుకొని, చైర్ పర్సన్ పదవి వైసీపీకే దక్కే విధంగా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా 11 మంది వైసీపీ కౌన్సిలర్లు గురువారం విజయవాడ చేరుకొని, తాడేపల్లి లోని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, పరిస్థితి వివరిస్తారని తెలుస్తోంది. అక్కడే అవిశ్వాస తీర్మానంపై వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *