న్యూ ఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పవన్ కు ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని.. సింగపూర్ అవసరమైన సాయం చేయాలని ఇప్పటికే అక్కడి విదేశాంగ శాఖ అధికారులను అదేశించినట్లు పవన్ కు తెలిపారు.. ఈ సమయంలో అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సింగపూర్ బయలుదేరిన పవన్, చిరంజీవి కుటుంబం
మరోవైపు, విశాఖ పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో సింగపూర్ బయల్దేరి వెళ్లారు. అలాగే చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు..
ప్రమాదం ఎలా జరిగింది..
కాగా, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్లో పిల్లలతో కలిసి ఉంటున్నారు.. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆమె ఇండియాకి వస్తూ తన భర్తను కలుస్తూ ఉంటారు. అయితే ఎప్పటిలాగే మార్కు శంకర్ రివర్ వ్యాలీ లో ఉన్న రోడ్ నెంబర్ 278 లో స్కూల్ కి నేడు చేరుకున్నారు. అయితే ఉదయం 9:45 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అక్కడి యాజమాన్యం సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కి సమాచారం అందించారు.
కుకింగ్ స్కూల్లో మంటలు
ఇకపోతే ఇది టొమాటో కుకింగ్ స్కూల్.. ఇది వంట పాఠశాలను నిర్వహిస్తోంది. న్యూటన్ షో బ్యానర్ కింద విద్యా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ వుంటుంది. ఇక ఇక్కడే మార్క్ శంకర్ విద్యను అభ్యసిస్తూ ఉండగా.. అది కుకింగ్ పాఠశాల కాబట్టి ఏదైనా తప్పిదం వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా మూడంతస్తుల భవనంలోని 2,3వ అంతస్తులలో మంటలు చెలరేగాయి. ఇక వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. పెద్దపెద్ద నిచ్చెనలు, కంబైన్డ్ ప్లాట్ఫామ్ నిచ్చెనలను వేసి మరి 15 మంది పిల్లలతో పాటు నలుగురు పెద్దలను రక్షించారు. ఇకపోతే పెద్ద ఎత్తున పొగ వెలువడడంతో పిల్లల ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని ,దీంతో పిల్లలను హుటాహుటిన హాస్పిటల్ కి కూడా చేర్చినట్లు సమాచారం. అంతేకాదు ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్న దాదాపు 80 మందిని పోలీసులు అలాగే ఎస్సిడిఎఫ్ సిబ్బంది కాళీ చేయించారు. మొత్తం 19 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సిడిఎఫ్ స్పష్టం చేసింది. గాయపడిన వారిలో ఒక విద్యార్ధి చికిత్స పొందుతూ మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.. మార్క్ శంకర్ తో పాటు మిగిలిన 18 మంది క్షేమంగా ఉన్నారని తెలిపారు.. అందరికీ చికిత్స చేస్తున్నామని, ఏ ఒక్కరికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.