(ఆంధ్రప్రభ, విజయవాడ స్పోర్ట్స్ ) : ఆంధ్రప్రదేశ్ నుంచి రాణించే క్రీడాకారులందరూ అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని విస్తృతం చేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో మే 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ జరగనున్న 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ జట్ల ఎంపికల ప్రక్రియను ప్రారంభించిన ఆయన ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు బాలుర, బాలికల జట్ల ఎంపికలకు వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు.
ఈసందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ… క్రీడాకారుల ప్రతిభ, ప్రదర్శనల మీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు కల్పిస్తున్న పథకాలు, పాలసీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడా ప్రోత్సాహకాలను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత క్రీడాకారులపైనే ఉందని సూచించారు.