AP | లిక్కర్ స్కాంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

అమరావతి, : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారింగా ప్రకటించారు. వరుసగా మూడ్రోజులపాటు వీరిని విచారించిన సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. .

ఈ కేసులో ధనుంజయ్‌రెడ్డి ఏ31 నిందితుడిగా, కృష్ణమోహన్‌రెడ్డి ఏ32 నిందితుడిగా ఉన్నారు. కాగా, ఇదే కేసులో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

పిటిషనర్లకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది దర్యాప్తు అధికారి విచారణకు ఆటంకం కలిగించినట్లు అవుతుందని అభిప్రాయపడింది.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వీరి ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు, మెరిట్స్ ఆధారంగా హైకోర్టు లేదా ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో వారిద్దరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు

వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో, నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో పాటు భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలను కూడా సిట్ ఇటీవల నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు మంగళవారమే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

Leave a Reply