AP | అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు… ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష !

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు.

జూన్ 21న విశాఖలో “Yoga for One Earth,One Health” అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం “యోగాంధ్ర-2025” నినాదంతో ప్రజల్లో యోగాపట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది.

ఈనెల 29వ తేదీ నుండి 4 వారాలు ప్రచార కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. ఈనెల 29వ తేదీ నుండి మొదటి వారం రోజులు అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో యోగా అవగాహన ప్రచార కార్యక్రమాలు, జూన్ 5వ తేదీ నుండి వారం రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలోను, జూన్ 12 నుండి వారం రోజుల పాటు గ్రామ స్థాయిలోను, జూన్ 17 నుండి విద్యా సంస్థల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానుద్ మాట్లాడుతూ…
విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబును ప్రభుత్వం నోడలు అధికారిగా నియమించిందని తెలిపారు.

విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ,పిజి చదివే విద్యార్థులు అందరినీ ఈకార్యక్రమంలో భాగస్వాము లను చేయాలని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు,యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు,పిఇటిలు, స్పోర్ట్స్ కోచ్ లు,విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు.

ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు.అలాగే పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి కె.శశిధర్,సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు,ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *