శ్రీశైలం : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ప్రాజెక్టులోకి లక్షా 62వేల క్యూసెక్కులు దాటి ఇన్‌ఫ్లో వస్తోంది. ఇంకా వరద పెరుగుతూ ఉండటంతో ఈరోజు నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి విడుదల చేయనున్నారు. మరోవైపు.. సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
శ్రీశైలం పర్యటన కోసం విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు.. ఇక, సున్నిపెంట హెలిప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకోనున్నారు.. 11 గంటల నుండి 11:35 వరకు శ్రీస్వామి అమ్మవార్లని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు.. 11:50 నుండి మధ్యాహ్నం 12:10 వరకు శ్రీశైలం జలాశయం వద్ద జలహారతిలో పాల్గొంటారు.. 12:25 నుండి 1:10 వరకు నీటి వినియోగదారుల సంఘంతో సంభాషిస్తారు.. మధ్యాహ్నం1:30 కు తిరిగి సున్నిపెంట హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ లో అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..