వెలగపూడి – కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని అన్నారు ఎపి సిఎం చంద్రబాబు. ఇప్పటికే వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళే బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే మీ పని తీరులో మార్పు రావాలని సున్నితంగా హెచ్చరించారు. మళ్లీ తాము సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పని తీరు ఉండాలని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు కడితే సహించేది లేదని హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల్లో అందరూ మళ్లీ గెలవాలని అన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నాయకుల పని తీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చెప్పారు. తాను త్వరలో మిమ్ములను పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతానని అన్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు. మీరు వాళ్లు కలుపుకొని వెళ్తేనే ముందుకెళ్లగలుగుతామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పనులు గురించి కూడా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. దాదాపు రెండు గంటలసేపు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.
