AP | భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ

AP | భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ

AP | ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఈ-బస్సులు
ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించే బస్సు సేవలు
కాలుష్యాన్ని తగ్గించే గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్

AP | విశాఖపట్నం,ఆంధ్ర‌ప్ర‌భ : ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చివరి దశ ప్రయాణ సౌలభ్యం (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విశాఖపట్నం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు, సమయ వ్యయం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు ఈ-బస్సులు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా నిలవనున్నాయి.

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం జూలై చివరినాటికి ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వస్తుండగా, అప్పటికే ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రకటన చేసింది. అందులో 100 బస్సులను విశాఖపట్నం జిల్లాకు కేటాయించనున్నారు. ఈ బస్సులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు నిర్వహించనున్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేకంగా 20 నుంచి 30 ఈ-బస్సులను నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ఈ బస్సులు ప్రయాణికులను తీసుకెళ్లనున్నాయి. అదనంగా నవోటెల్, డాల్ఫిన్ వంటి ప్రముఖ హోటళ్ల నుంచి కూడా ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌కు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే అనకాపల్లి జాతీయ రహదారి మార్గం, శ్రీకాకుళం వైపు నుంచి కూడా కొన్ని బస్సులు నడపనున్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సౌకర్యం పెంచడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కూడా ఉపయోగపడనున్నాయి.

Leave a Reply