వెలగపూడి : తీవ్ర అస్వస్థతతో ఉన్నా సభకు వస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడికి విశ్రాంతి ఇస్తూ రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు.. అది వీలు కాకుంటే ఆ మంత్రిని వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని అభ్యర్ధించారు.. ఈ ప్రతిపాదనకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.
వివరాలలోకి వెళితే… గత రెండు రోజులుగా నిమ్మల రామానాయుడు అస్వస్థతతోనే సభకు హాజరవుతున్నారు.. ఒక రోజు కుడి చేతికి సెలైన్ ఎక్కించుకున్న స్టిచ్ తో హాజరైన ఆయన నేడు ఎడమ చేతికి స్టిచ్ లో సభకు వచ్చారు.. సభకు వచ్చే ముందు లాబీలో ఆయన నారా లోకేష్ కు ఎదురయ్యారు.. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ సభకు రావడం ఎందుకని ప్రశ్నించారు. విశ్రాంతి తీసుకుంటారా.. లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా.. అంటూ రామానాయుడుతో నారా లోకేష్ అన్నారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందేనన్నారు. నిన్నటి వరకూ ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని శుక్రవారం మరో చేతికి పెట్టుకుని తిరుగుతుంటే ఆరోగ్యం ఏం కావాలన్నారు.
లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. నిన్నటి కంటే ఆరోగ్యం కొంచెం బాగానే ఉందని.. అందుకే వచ్చానని అన్నారు. విశ్రాంతితో కూడిన ప్రశాంత నిద్రతోనే ఆరోగ్యం కుదుటపడుతుందని లోకేష్ అన్నారు. మాట వినకుంటే తన యాపిల్ వాచ్‌ని ఇక రామానాయుడు చేతికి పెట్టి నిద్రను తాను మానిటర్ చేస్తానని లోకేష్ అన్నారు. తాను పని ఒత్తిడికి గురైనప్పుడు ఓ 15 నిమిషాలు టీవీ చూస్తూ పడుకుంటే తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉంటుందని లోకేష్ అన్నారు. ఈ పద్ధతి ప్రయత్నించి చూడాలని రామానాయుడుకు సూచించారు.
ఇక ఇదే అంశాన్ని నారా లోకేష్ ప్రస్తావించారు. కీలక శాఖలో ఉన్న మంత్రి నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని అన్నారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ కోరారు.. అందుకు డిప్యూటీ స్పీకర్ నవ్వుతూ రామనాయుడు కాస్త విశ్రాంతి తీసుకో అన్నారు.. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.
