వెలగపూడి – రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి , సాధికారత కల్పించేందుకు యునిసెఫ్‌తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం, యూనిసెఫ్ మూడు ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాయి. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్‌డీసీ, యునిసెఫ్ యువాహ్ ప్రతినిధులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యునిసెఫ్, ఏపీఎస్ఎస్ డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (వైఎఫ్ఎస్ఐ), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (పీ2ఈ) కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి. యువతలో నవీన ఆవిష్కరణలు, ఇంక్లూజన్, స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందించనున్నాయి.
యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్‌షిప్ అవకాశాలను కల్పిస్తారు. పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (పీ2ఈ) కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యగల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారు.