విజయవాడ – వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు హోంమంత్రి వంగలపూడి అనిత . నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదని, ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు,ఎన్డీయే ప్రభుత్వమన్నారు. కూటమిలో అంతర్యుద్ధం ఉందంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
రెడ్ బుక్ తెరిస్తే ఒక్కరు కూడా మిగలరు..
రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని ,అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా…. అనుభవించేది రాజానే అని అన్నారు.
పోలీస్ శాఖకు బకాయిలే ..
పోలీస్ శాఖలో రూ. 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారని.. అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు. ఇంతవరకు ఏపీకీ అప్పా, . గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని అంటూ త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
గోరంట్ల పై ఫిర్యాదుల పర్వం …
కాగా.. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్‌పై టీడీపీ, జనసేన పార్టీలు సీరియస్ అయ్యాయి. మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు రెండు పార్టీల నేతలు. గోరంట్ల వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, అత్యాచార బాధితురాలి పేరు భయపెట్టారంటూ విచారణకు రావాల్సిందిగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్లకు నోటీసులు ఇచ్చారు.