వెలగపూడి – రాష్ట్రంలో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయ మార్గాలు పెంచుకోవలన్నారు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు. సచివాలయంలో వివిధ ఆర్ధిక శాఖల అధికారులతో నేడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందన్నారు. అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు..
పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని ఆదేశించారు.. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు.
గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని.. వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ.. ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింతం వేగం పెంచవచ్చని సూచించారు.