AP | అంబటి వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలే

AP | అంబటి వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలే
- ఇలాంటి నేతలను ప్రజలే రాజకీయాల నుంచి దూరం పెట్టాలి
- మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు
AP | నందిగామ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు తీరును మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు వసంత నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడే నేతలను ప్రజలే శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నందిగామలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1970 నుంచి తాము రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంత స్థాయి లేని రాజకీయ భాషను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాగా, సంయమనంతో మాట్లాడాలని, కానీ సహనం కోల్పోయి దిగజారి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిపై ఈ తరహా పదజాలం వాడటం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సంస్కార రాజకీయాలకు విరుద్ధమన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, ముఖ్యమంత్రి గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఇకపై ప్రజలే బుద్ధి చెప్పి రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హుందాతనం, విలువలు, బాధ్యత కలిగిన మాట తీరు రావాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా మాటల రాజకీయాలకు కాకుండా పనితీరు ఆధారంగా నేతలను తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.
