జ్యోతిరావు పూలే బాటలో పయనిద్దాం..

జ్యోతిరావు పూలే బాటలో పయనిద్దాం..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
కొండపల్లిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: భావితరాలకు మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన వెలుగు బాటలో మనమంతా పయనిద్దామని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కొండపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి, పక్కనే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ “మన దేశంలో ఉద్భవించిన సంఘ సంస్కర్తలందరిలో అగ్రగణ్యుడు, వెలుగుబాట చూపిన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ద్విశతాబ్ది ఉత్సవాలు నేడు ప్రారంభమవుతుండటం విశేషమన్నారు. మహానుభావులను మనమంతా గుర్తించి, గౌరవించాలని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఆనాడు పూలే లాంటి ఎందరో మహానుభావుల పోరాటాల కారణంగా నేడు మనం సమాన హక్కులు పొంది స్వేచ్ఛగా జీవిస్తున్నామని చెప్పారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో అట్టడుగు, పేద వర్గాల ప్రజలు ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే నైతిక స్థైర్యానికి, నిరంతర శోధనకు ప్రతీకగా నిలిచారన్నారు. ఆయన సమాజ శ్రేయస్సు పట్ల అచంచల నిబద్ధతతో జీవనం సాగించారన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పూలే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విజ్ఞాన సముపార్జన తృష్ణకు, ధైర్యానికి, సామాజిక నిబద్దతకు ఆటంకం కలిగించలేదన్నారు. పాఠశాల స్థాయి నుంచే జ్యోతిరావు పూలేలో లోతైన జ్ఞాన తృష్ణ ఉండేదన్నారు.
సమాజంలో అందరికీ సమాన హక్కులు దక్కే వరకూ నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించదు అని మహాత్మా జ్యోతిరావు పూలే దృఢంగా విశ్వసించారని, ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే వ్యవస్థలను నిర్మించి సామాజిక న్యాయానికి దోహదపడ్డారన్నారు. ఆయన స్థాపించిన ‘ ‘సత్యశోధక్ సమాజ్’ ఆధునిక భారతంలో ఉద్భవించిన అతిముఖ్యమైన సంఘ సంస్కరణోద్యమమని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ, కూటమి నేతలు పాల్గొన్నారు.
