డ్రోన్లతో తనిఖీ చేస్తున్న పోలీసులు..

డ్రోన్లతో తనిఖీ చేస్తున్న పోలీసులు..

చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..

ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పెదపేట రామాలయం ఘటన రాష్ట్ర మొత్తం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్వగ్రామంలోనే శ్రీరామనవమి వేడుకల్లో జరిగిన కూటమి నేతలపై దాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు 57 మందిపై కేసు నమోదు చేయగా 41 మందిని రిమాండ్ కు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు హిందూ,క్రైస్తవ సంఘాలు చలో ఆకివీడుకు ఏప్రిల్ 5న ఆదివారం పిలుపునివ్వడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

ఉదయం నుండి సుమారు 450 మంది పోలీసులు ఆకివీడు మండలంలో చెక్పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకివీడులో బయట వారిని రానిచ్చేది లేదని, 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో సభలు,సమావేశాలు,ర్యాలీలకు అనుమతి లేదని డిఎస్పి రఘువీర్ తెగేసి చెప్పారు. ఎవరైనా నిబంధనను మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడమే కాకుండా, డ్రోన్ కెమెరాల సహాయంతో క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలిస్తున్నారు.

కైకలూరులో ప్రముఖ నటి, హిందూ సంఘానికి చెందిన కరాటే కళ్యాణి పోలీసులు లాడ్జిలో నిర్బంధించినట్టుగా ఆమె సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. ఆకివీడు రామాలయంలో దండ వేసి తీరతామని కరాటే కళ్యాణి ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి కైకలూరులో లాడ్జిలో బస చేయగా, కొంతమంది పోలీసులు వారిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారని వివరించారు. కళ్యాణి తో పాటు పలువురు హిందూ సంఘాలు నేతలు హౌస్ అరెస్ట్ చేశారు.

Leave a Reply