పేదల కళ్ళల్లో సంతోషం నింపటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

పేదల కళ్ళల్లో సంతోషం నింపటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
అవనిగడ్డలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పేదల కళ్ళల్లో సంతోషం నింపటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డలో గ్రామ సచివాలయం -4 పరిధిలోని ఎస్టీ కాలనీలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తోందని తెలిపారు. ఒకటో తేదీ సెలవు వస్తే ఒకరోజు ముందే పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
సమర్థవంతమైన అధికార యంత్రాంగంతో కూటమి ప్రభుత్వం ప్రతి నెల విజయవంతంగా పింఛన్లు అందిస్తోందని తెలిపారు. పలు రకాల అనారోగ్యాలతో మంచానికే పరిమితమైన అభాగ్యులకు రూ.15వేలు పింఛన్ ఇవ్వటం ద్వారా వారి జీవనానికి భరోసా ఇవ్వటమే కాకుండా, వారికి సపర్యలు చేసే కుటుంబ సభ్యులకు కూడా ఉపశమనం కలిగేలా ప్రభుత్వం ఉత్తమ నిర్ణయం తీసుకుని పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
