AP | వైభవంగా భవానీ దీక్షల విరమణలు..

AP | వైభవంగా భవానీ దీక్షల విరమణలు..
- 42 సంవత్సరాలుగా భవాని మండల దీక్షలు..
- నాడు 9 మందితో.. నేడు 9 లక్షలకు..
- వైదిక కమిటీ పర్యవేక్షణలోనే విరమణలు..
- ఇరుముడులు విప్పింది గురు భవానీలే..
- ఈవో పాలకవర్గ సేవలు అమోఘం..
- ప్రతి భవాని నుండి సంతృప్తికర ప్రశంసలు..
AP | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కనకదుర్గమ్మ వారి చల్లని దీవెనలు చూపులతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉంటున్నాయని విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వారి దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ పేర్కొన్నారు. అజ్ఞానం అవగాహన లేమితో కొందరు భవాని ఇరుముడులను వాస్తవాలను వక్రీకరించి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైదిక కమిటీ పర్యవేక్షణలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు దీక్ష (Deeksha) విరమణలు జరుగుతున్నాయన్నారు. భవానీ దీక్షలు విరమణ ప్రారంభం రోజున ఈవో దుర్గ గుడి చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన దీక్ష విరమణ సందర్భంగా ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై దుర్గగుడి ఆలయ వైదిక కమిటీ సభ్యులు స్పందించారు.
ఆలయ ప్రధానార్చకులు వైదిక కమిటీ సభ్యులతో (committee members) కలిసి స్థానాచార్యులు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ… 42 సంవత్సరాల క్రితం ప్రారంభించిన భవాని మండల దీక్షలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అన్నారు. నాడు 9 మందితో ప్రారంభించిన మండల దీక్షలు నేడు 9 లక్షల భవానీలు చేరుకునే స్థాయికి వచ్చిందన్నారు. ఈ ఏడాది విశ్వాస నామ సంవత్సర మండల దీక్షలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గ గుడి చైర్మన్ ఈవో ఆధ్వర్యంలో అధికారులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేశారన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది భవానీల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పిన ఆయన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారని భవానీలందరికీ ఉచితంగా లడ్డు, అన్న ప్రసాదాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైదిక కమిటీ పర్యవేక్షణలోనే చండీ హోమం మూలమంత్రం వంటి అతి ముఖ్యమైన పూజా కార్యక్రమాలు అమ్మవారికి నిర్వహిస్తున్నామని చెప్పారు.
దీక్ష విరమణలో భాగంగా ఈ నెల 11వ తేదీ గురువారం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి దీక్ష విరమణలను ప్రారంభించామని తెలిపారు. మొట్టమొదటి ఇరుముడిని గణేష్ గురుస్వామి స్వీకరించి ఇరుముడిని తీసి దుర్గ గుడి చైర్మన్ ఈఓలకు క్రతువును వివరించారని చెప్పారు. ఇరుముడిని విప్పింది మాత్రం గురుస్వామిలే అయితే.. కొందరు అజ్ఞానం, అవగాహన లోపం మిడిమిడి జ్ఞానంతో వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయ పవిత్రతను దెబ్బ కొట్టే విధంగా సోషల్ మీడియాలో (media) ప్రచారం చేయడం దారుణం అన్నారు. గురుభవానిల ఆధ్వర్యంలోనే ఇరుముడిలు జరుగుతున్నాయన్న ఆయన వైదిక కమిటీ సభ్యులు స్వయంగా అన్ని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. కనకదుర్గమ్మ నామస్మరణతో పాప నివారణ జరుగుతుందని చెప్పిన ఆయన వాస్తవాలను భక్తులందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు మురళి, షణ్ముఖ శర్మలు ఉన్నారు.
