చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యం..

చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యం..
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల మండలం మరుప్రోలు వారి పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడి కేంద్ర భవనాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి, భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్‌వాడి కేంద్రాలు చిన్నారుల ప్రాథమిక విద్యకు, పౌష్టికాహార పంపిణీకి నిలయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
నూతన భవనంలో చిన్నారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామాల్లోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఈ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చలగల రాజశేఖర్ బాబు, ఆర్డిఓ గ్లోరియా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, సిడిపిఓ లక్ష్మీపార్వతి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, అంగన్‌వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
