ఏపీ లో 528 కస్తూర్బా విద్యాలయాలలో అడ్మిషన్లు..

ఏపీ లో 528 కస్తూర్బా విద్యాలయాలలో అడ్మిషన్లు..

1.16 లక్షల మంది విద్యార్థినులకు ప్రవేశ అవకాశం
స్బూర్భా విద్యాలయాలలో మౌలిక సదుపాయల కల్పన విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరు బేష్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం

ఆంధ్రప్రభ, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 528 కస్తూర్భా విద్యాలయాల్లో అడ్మిషన్లకు అవకాశం ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 587 విద్యాలయాలు మంజూరు కాగా, ప్రస్తుతం 528 పాఠశాలలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆయా విద్యాలయాల ద్వారా 1.16 లక్షల మంది విద్యార్థినిలకు ప్రవేశం కలగనుందని మంత్రి చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో కస్తూర్భా పాఠశాలల మంజూరు, మంజూరైన విద్యాలయాల్లో ఎన్ని అందుబాటులోకి వచ్చాయి? విద్యార్థినిలకు ప్రవేశాలు, తదితర వివరాలు కోరుతూ అడిగిన ప్రశ్నకు మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కెజిబివి ) పనితీరుపై ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల కోసం కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. 2021-22లో రూ. 329.80 కోట్లు కేటాయించగా , 2023-24లో రికార్డు స్థాయిలో రూ. 749.97 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 464.10 కోట్ల (46,410.07 లక్షలు) నిధులను ఆమోదించినట్లు వివరించారు ఈ నిధులను సమగ్ర శిక్ష పథకం కింద విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు .

రాష్ట్రంలోని 21 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ విద్యాలయాల్లో మొత్తం 1,16,160 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పించే సామర్థ్యం ఉందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గరిష్టంగా 51 పాఠశాలలు మంజూరు కాగా 48 అందుబాటులో ఉన్నాయన్నారు. నంద్యాల జిల్లాలో 47 మంజూరు కాగా 46 పని చేస్తున్నాయని, విజయనగరం జిల్లాలో 46 మంజూరు అయితే 43 పని చేస్తున్నట్లు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 46 మంజూరు కాగా 43 పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. కర్నూలు జిల్లాలో మంజూరైన 42 పాఠశాలలు అన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ పరంగా మంత్రి జయంత్ చౌదరి అభినందించారు.

విద్యాలయాల్లో విద్యుదీకరణ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అదనపు తరగతి గదులు, ఐసీటీ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శద్ద్రతో ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని కస్తూర్బా విద్యాలయాలు శాశ్వత భవనాల్లోనే నడుస్తున్నాయని, ఇది విద్యార్థినుల భద్రతకు భరోసానిచ్చే అంశం అన్నారు. దశలవారీగా 6-8 తరగతుల స్థాయి నుంచి 12వ తరగతి వరకు (ఇంటర్మీడియట్) కస్తూర్భా పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల (పీహెచ్‌సీ) కోసం అన్ని పాఠశాలల్లో ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం వంటి సౌకర్యాలు కల్పిస్తుండటం అభినందనీయమన్నారు. కేజీబివిలలో సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యాన్యువల్ వర్క్ ప్లాన్ ఆధారంగా ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబి) నిధులను కేటాయిస్తుందని, క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ద్వారా విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని కాపాడుతున్నట్లు వివరంచారు.

Leave a Reply