సొంతింటి కల సాకారమైన వేళ..

సొంతింటి కల సాకారమైన వేళ..
జక్కంపూడిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ
పీఎం, సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదం స్ఫూర్తితో ముందుకెళ్లాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్
ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా పీఎం, సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరిందని.. సొంతిల్లు పొందిన ప్రతిఒక్కరికీ శుభాక్షాంకలు తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అన్నారు. సోమవారం జక్కంపూడిలోని ఎన్టీఆర్ నగర్లో జరిగిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సొంతిల్లు అనేది జీవితకాల కల అని.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కృషితో అది నేడు నెరవేరిందని పేర్కొన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా కృషిచేయడం వల్ల ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని. జక్కంపూడి ఎన్టీఆర్ నగర్లో 2,256 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందన్నారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తిచేసి రెండు మూడు నెలల్లో అందజేస్తామని వెల్లడించారు. ఒక్క రూపాయితోనే పొందిన 300 ఎస్ఎఫ్టీ ఇంటి మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 12 లక్షలు ఉందని.. అదేవిధంగా దాదాపు మూడున్నర లక్షలతో పొందే 365 ఎస్ఎఫ్టీ ఇల్లు రూ. 14 లక్షలు, దాదాపు రూ. 4 లక్షలతో పొందే 430 ఎస్ఎఫ్టీ ఇల్లు రూ. 17 లక్షల వరకు ఉందని వివరించారు. దీన్నిబట్టి ఏస్థాయిలో స్థిరాస్తి సొంతమైందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంచి రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, డ్రెయిన్లు, పార్కులు ఇలా సకల సౌకర్యాలూ కల్పించడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా….
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్ర లక్ష్యంగా వేస్తున్న అడుగుల్లో వడివడిగా నడవాలని సూచించారు. ప్రతిఒక్కరూ కాలనీలో పారిశుద్ధ్యం బాగుండేలా చూడాలని.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ప్రతినబూనాలని పేర్కొన్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం..
చిన్నదో, పెద్దదో సొంతిల్లు ఉండాలనేది ప్రతిఒక్కరి జీవిత కల అని.. ఆ కలను నేడు నెరవేర్చడం జరిగిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పేదవానికి పక్కా ఇల్లు ఉండాలనేది నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంకల్పంచి అడుగులు వేస్తే చంద్రబాబు నాయుడు తన హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇల్లు వస్తుందో రాదో అనే ఆందోళన లబ్ధిదారుల్లో ఉండేదని.. మాటను నిలబెట్టుకుండా ఈ రోజు ఇళ్లను అప్పగించడం జరిగిందన్నారు.

పేదల కష్టాలు తొలగాయి..
పేదల అద్దె ఇంటి కష్టాలు నేడు తొలగాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి శరవేగంగా ముందడుగు వేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి అప్పగించడం జరుగుతోందన్నారు. పూర్తయిన ఇళ్లు పూర్తయినట్లుగా వెనువెంటనే లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. సొంతింటిని పొందిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డా. డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు బి.రమ్య కీర్తన, కె.ప్రభుదాస్, కె.షమ్మీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం.విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ అమృత్ ఇంచార్జ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






