AP | రాయలసీమలో 25 శాతం ఎలక్ట్రానిక్ యూనిట్లు..

తిరుపతి,ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 25 శాతం యూనిట్లు దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్  శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీం (ఈసిఎంఎస్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టుబడుల ప్రమోషన్ లో భాగంగా ఈరోజు నగరంలోని ప్రైవేట్ హోటల్ లో ఐటి ఈ&సి, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్  సంయుక్తంగా నిర్వహించిన  ఒక్క రోజు కార్యశాలలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ…. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలసీ కన్నా అదనంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి రాయితీలు గానీ, సదుపాయాలు కానీ మెరుగ్గా అందించే విధంగా విధానాన్ని ఉండేలా రూపొందిస్తున్నామని అన్నారు.

ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల స్థానంలో స్థానికంగా తయారు చేసే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ఆ విధానం ఉంటుందన్నారు. అంతేకాకుండా 25 శాతం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు దక్షిణ రాయలసీమలో నెలకొల్పటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పలు పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన కార్యశాల విజయవంతమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఈజ్ ఆఫ్ డూఇంగ్ బిజినెస్ మాత్రమే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా యూనివర్సిటీలు ఉన్నాయని.. తగినంత మంది నైపుణ్యం కలిగిన స్కిల్డ్ పర్సన్స్ అందుబాటులో ఉన్నారని, అదేవిధంగా పరిశ్రమల అవసరాలకు తగిన వృత్తి నైపుణ్యాన్ని అందించే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.

ఈ కార్యశాలలో ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ అడ్వైజర్ రాజేష్ శర్మ,  సైంటిస్ట్  రష్మి రతి తివారీ సైంటిస్ట్, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply