గ్యాస్ కొరతతో హోటళ్లకు ఇబ్బందులు..

గ్యాస్ కొరతతో హోటళ్లకు ఇబ్బందులు..
కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్న రెస్టారెంట్లు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరత రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లలో వేడి వేడి పదార్థాలు తయారు చేసేందుకు అవసరమైన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. మచిలీపట్నంలో గ్యాస్ కొరత కారణంగా నగరంలోని అనేక హోటళ్లు, చిన్న రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలను వినియోగిస్తూ వంట పనులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా గ్యాస్ స్టౌవ్లపై వేగంగా తయారయ్యే వంటకాలు ఇప్పుడు కట్టెల పొయ్యిలపై ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల వ్యాపారంపై ప్రభావం పడుతుందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యిల వినియోగం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు పని భారమూ పెరుగుతోందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా గ్యాస్ సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి రావాలని, లేకపోతే హోటల్ వ్యాపారం మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
