గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు..

గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు..
జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది, ధరలు భారీగా పెరిగాయి, యుద్ధ పరిస్థితుల కారణంగా సరఫరా నిలిచిపోతుందని వంటి నిరాధార వార్తలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో కొంతమంది వ్యక్తులు గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని వంటి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే కాకుండా సమాజంలో అపోహలు మరియు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయడం, షేర్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం కూడా చట్టపరంగా నేరమని ఎస్పీ స్పష్టం చేశారు.
గ్యాస్ కొరత ఉందని, ధరలు పెరిగాయని వంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేసే వారిని గుర్తించి వారి మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించినా లేదా కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు ప్రజలకు ఉపయోగపడే వేదికగా ఉండాలని, భయాందోళనలు సృష్టించే వేదికగా మారకూడదన్నారు.
నిర్ధారణ లేని వార్తలను షేర్ చేయడం కూడా అసత్య ప్రచారానికి సహకరించినట్లేనని పేర్కొన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి లాభపడాలని ప్రయత్నించే వారిపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష చూపరని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మి గందరగోళానికి గురికాకూడదని సూచించారు. ఎక్కడైనా అసత్య ప్రచారాలు లేదా గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.
