అనారోగ్యంతో ఉన్న క్రీడాకారిణి..

అనారోగ్యంతో ఉన్న క్రీడాకారిణి..
చంద్రికకు అండగా శాప్
ఆసుపత్రిలో పరామర్శించిన చైర్మన్ రవి నాయుడు
రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేత
ఆంధ్రప్రభ, విజయవాడ : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చంద్రిక చికిత్సకు వ్యక్తిగతంగా రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి కీర్తి తెచ్చిన క్రీడాకారిణి చంద్రికను అభినందించిన రవి నాయుడు, క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతిభావంతమైన క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్ టోర్నమెంట్లలో మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరిన్ని విజయాలు సాధించాలని చంద్రికకు సూచించారు. యువ క్రీడాకారులకు చంద్రిక ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్న రవి నాయుడు, ఆమె త్వరగా కోలుకుని మళ్లీ క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
