మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది..

మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది..
దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలపడంలో మహిళామణులే కీలకం..
ప్రతి మహిళనూ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకే రైజ్ ఏర్పాటు..
వినూత్న కార్యాచరణకు నీతి ఆయోగ్ నుంచి సైతం ప్రశంసలు..
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి.. వారు మహిళలే కావాలి..
2047 నాటికి రూ. 65 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా అడుగులు..
ఏఐ, గ్రీన్ ఎనర్జీ, లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలపైనా ప్రతి వారం వర్క్‌షాప్‌లు..
వికసిత్ నారీ శక్తితోనే వికసిత్ భారత్ సాక్షాత్కారానికి బలమైన పునాది
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం : రైజ్.. గ్రామీణ మహిళలకు ఒక వరం…. దాగిఉన్న ప్రతిభకు అరుదైన వరం.. కలవనున్న సాంకేతిక సంకల్పం.. మహిళలు పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం.. ఈ అక్షరమాలలు.. మగువులను స్వావలంబన దిశగా నడిపించే నినాదాలు.. స్వయంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలం నుంచి జాలువారిన ప్రేరణాత్మక భావాల సందేశాలకు ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలోని రైజ్ కార్యాలయం ప్రాంతం వేదికగా నిలిచింది. ఆదివారమిక్కడ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలతో వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ప్రసంగాన్ని వర్చువల్‌గా వీక్షించారు.
వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం, దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని.. జిల్లా, రాష్ట్రం, దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టడంలో మహిళామణుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దాదాపు అయిదు వేల మందికి ఈ కేంద్రం ద్వారా చేరువయ్యామన్నారు. రైజ్ ద్వారా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి కూడా ప్రశంసలు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఆ అవకాశం మహిళలకు కల్పించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తలసరి ఆదాయాన్ని రూ.65 లక్షలకు పెంచే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా మహిళలకు ఆధునిక నైపుణ్యాలను అందించేందుకు ఏఐ, గ్రీన్ ఎనర్జీ, లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రతి శనివారం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించాలని చెబుతుంటారని.. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనిచ్చేందుకు రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వికసిత్ నారీ శక్తితో వికసిత్ భారత్..
భారత నారీశక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. మహిళల స్వయం సమృద్ధి ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్‌ను వికసిత్ భారత్‌లో కీలక భాగస్వామ్యంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని అన్నారు. దేశ సేవలో మహిళలకు అత్యున్నత స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయని, ప్రస్తుతం దేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించారని తెలిపారు.

అలాగే దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సమర్థవంతంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఎన్నో పాత్రల్లో గౌరవించే భారత సంస్కృతిలో నారీశక్తికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళల సాధికారతకు ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలపడేలా దేశవ్యాప్తంగా 3 కోట్ల లక్‌పతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 18 లక్షల మంది లక్‌పతి దీదీలు ఉన్నారని, రాబోయే రెండు సంవత్సరాల్లో మరో 30 లక్షల మందిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. షీ మార్ట్స్ కార్యక్రం ద్వారా దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యం ఉందన్నారు.
ఓ మహిళ చేయూతతోనే ఈ స్థాయికి చేరుకున్నా..
తన చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారని.. ఆ సమయంలో ఓ మహిళామూర్తి ఇచ్చిన చేయూతతోనే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. మహిళామణులు కష్టాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందడుగు వేయాలని.. ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక యూనిట్లు స్థాపించి తన కాళ్లపై తాను నిలబడటంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇందుకు రైజ్ కేంద్రం తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్స వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గద్దె అనూరాధ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.కల్పన, విజయవాడ ఆర్‌డీవో టీవీ సతీష్ తదితరులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మహిళా సాధికారతకు ముందడుగు వేసేలా ప్రోత్సహించారు.

మహిళామణులకు సత్కారం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు క్షేత్రస్థాయిలో మహిళా సంక్షేమం, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న స్వయం సహాయక సంఘాల సమాఖ్యల సారథులను కలెక్టర్ లక్ష్మీశ, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, జేసీ ఇలక్కియ తదితరులు ఘనంగా సత్కరించారు. 16 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్‌ను కూడా సత్కరించారు. ఇప్పటికే వివిధ పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకెళ్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకొని మరింత మహిళలు ముందుకొచ్చి ఆర్థిక సాధికారత దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక చేయూత.
డీఆర్‌డీఏ ద్వారా వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 83.78 కోట్లు; 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ. 829.55 కోట్లు; స్త్రీనిధి-క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 138.41 కోట్ల ఆర్థికసహకార చెక్కులను పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (విసన్నపేట)కు ట్రాక్టర్ ను అందించే కార్యక్రమం కూడా జరిగింది.

ప్రోత్సాహానికి ప్రతీకగా స్టాళ్లు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లు మహిళలను ప్రోత్సహించేందుకు వేదికలుగా నిలిచాయి. ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్), డ్రగ్స్‌పై దండయాత్ర-మహిళల రక్షణ మన బాధ్యత, మాతా శిశు సంరక్షణ, మహిళల ఆరోగ్య పరిరక్షణ, సమగ్రశిక్ష, మెప్మా, డీఆర్‌డీఏ-స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), ఐసీడీఎస్, సింటిల్లా-ట్రాన్స్‌ఫర్మేషన్ యువర్ లైఫ్ విత్ క్రియేటివ్ ఏఐ, ఎ.కొండూరు మండలం-ఫుడ్ బాస్కెట్ తదితర స్టాళ్లు మహిళల సమగ్రాభివృద్ధిపై జాగృతం చేశాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల్లో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, సింటిల్లా ఏఐ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీపీవో పి.లావణ్యకుమారి, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు, రైజ్ మేనేజర్ తేజస్విని, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, మెప్మా, యూసీడీ తదితర శాఖల అధికారులతో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
