“ఓపెన్ హౌస్” నిర్వహించిన గుంటూరు పోలీసులు..

“ఓపెన్ హౌస్” నిర్వహించిన గుంటూరు పోలీసులు..

గుంటూరు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లో సిఐ అండ్ ఎస్సై మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కొల్లిపర పిఎస్, దుగ్గిరాల పిఎస్, పెదనందిపాడు పిఎస్, కాకుమానుపిఎస్, తెనాలి టూ టౌన్ పిఎస్, పట్టాపురం పిఎస్, నగరంపాలెం పిఎస్ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో విద్యార్థినులకు “ఓపెన్ హౌస్” ప్రోగ్రాం జరిగింది.

ఈ కార్యక్రమంలోను విద్యార్థినులకు పోలీస్ స్టేషన్‌లోని విభిన్న విభాగాల గురించి తెలిపారు. మహిళా భద్రత, అత్యవసర వ్యవస్థ, డయల్ 100/112, భద్రతా యాప్‌ల ఉపయోగం వంటి అంశాలపై వివరమైన అవగాహన కల్పించారు.

పోలీసులు తమ విధుల్లో ఉపయోగించే ఆధునిక ఆయుధాలు, తుపాకులు మరియు పిస్టల్స్ గురించి, కమ్యూనికేషన్ పరికరాలు, సెఫ్టీ గాడ్జెట్‌లు, మిషనరీ సామగ్రి గురించి ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్ప్‌లైన్ నంబర్లు, స్వీయరక్షణ పద్ధతులపై మెలుకువలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు పోలీసుల సేవలపై ప్రశ్నలు అడిగి, తమ సందేహాలకు సమాధానాలు పొందారు. మహిళా పోలీసులు సమాజ రక్షణలో పోషించే కీలక పాత్రపై అవగాహన పెంచడంతో పాటు, యువత కూడా భద్రతను కాపాడేందుకు చైతన్యం కలిగి ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు.

అనంతరం పోలీసు అధికారులు విద్యార్థినులకు నైతిక విలువలు, ధైర్యసాహసాలు, లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు.

మార్చి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ తరహా కార్యక్రమాలు మహిళలకు శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది,హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply