వర్క్‌షాప్‌లు సక్రమంగా నిర్వహించాలి..

వర్క్‌షాప్‌లు సక్రమంగా నిర్వహించాలి..

గుంటూరు, ఆంధ్ర ప్రభ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఆర్‌ఏఎంపీ (RAMP) కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్‌ఏఎంపీ ద్వారా వెండర్ డెవలప్‌మెంట్, ఉద్యమ్, ఈఎస్‌డీపీ వంటి వర్క్‌షాప్‌లను ఎంఎస్‌ఎంఈలు, అమ్మకదారులు, తయారీదారులకు వ్యాపార నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా శిక్షణ సంస్థలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిశ్రమల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ విండో ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎస్‌ఎల్‌ఏ గడువులోపే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే పీఎంఈజీపి, ముద్రా, పీఎంఎఫ్‌ఎంఈ, స్టార్టప్ ఇండియా వంటి పథకాలతో పాటు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి అవి నూరుశాతం గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లాలో క్యాబినెట్ ఆమోదం పొందిన ఎంవోయూల ప్రకారం పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో వివిధ పరిశ్రమలకు సంబంధించిన రాయితీల కింద 15 క్లెయిమ్‌లకు రూ.3,39,06,843 మంజూరు చేస్తూ సమావేశంలో కలెక్టర్ ఆమోదం తెలిపారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ. జయలక్ష్మి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్ఎన్ రావు, డీపీఓ సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, ఉద్యాన శాఖ అధికారి రవీంద్రబాబు, డీసీఎల్ఏ గాయత్రిదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, సీపీడిసీఎల్, ఆర్టీఓ శ్రీహరి, సిక్కి ఆర్ఎం పరిమళ, డీఐసీసీఐ జిల్లా కోఆర్డినేటర్ కె. పావని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply