రహదార్ల నిర్మాణం చేపట్టాలి..

రహదార్ల నిర్మాణం చేపట్టాలి..
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో రహదారుల నిర్మాణం చేపట్టి సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇన్చార్జి సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు (సాంబు), టిడిపి నాయకులు కొల్లా ఆనంద్ కుమార్ లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడలో యార్లగడ్డను కలిసిన నాయకులు పలు సమస్యలను యార్లగడ్డ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.44 లక్షల నిధులు మంజూరు అయ్యాయని కొన్ని కారణాలవల్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదన్నారు. సిసి రోడ్ల పనులు సత్వరమే పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పంచాయతీ పరిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను సిండికేట్ బ్యాంక్ సమీపంలో పడవేశారని ప్రస్తుతం అక్కడ తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో పరిసరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అక్కడ చెత్తను వేరే ప్రాంతాన్ని తరలించేలా పంచాయతీ అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంకట్రావు జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి చెత్త సమస్యను పరిష్కరించాలని కోరారు. రహదారుల నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరుచేయించానని, సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన భూమిని చూడాలని నాయకులకు యార్లగడ్డ సూచించారు. తమ సమస్యల పట్ల సత్వరమే స్పందించిన యార్లగడ్డకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు వరుసగా నాభిగాని కొండ, మున్నంగి సత్యనారాయణ, నాయకులు కొంగన రవి, చిమ్మిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
