AP | ప్రభుత్వ సలహా సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన

AP | ప్రభుత్వ సలహా సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
క్యూ మార్గ సముదాయం, పరిపాలనా భవనాలపై రూపకల్పనకు సూచనలు
AP |ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మౌలిక వసతుల అభివృద్ధి దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సలహా సంస్థ ఏపీఐటీసీఓ లిమిటెడ్ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఇంద్రకీలాద్రిపై స్థల పరిశీలన నిర్వహించి అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష చేపట్టింది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ సూచనల మేరకు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నాయకత్వంలోని బృందం దేవస్థానం అధికారులతో సమావేశమైంది. ప్రతిపాదిత క్యూ మార్గ సముదాయం (క్యూ లైన్ కాంప్లెక్స్), పరిపాలనా కార్యాలయ భవనం (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్) నిర్మాణాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయడంపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బి. రాధాకృష్ణ (గాంధీ)లతో అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అన్నదానం సముదాయం విస్తరణ, భూగర్భ స్థలాల (సెల్లార్) సమర్థ వినియోగం, భక్తుల రద్దీ నియంత్రణకు అవసరమైన సదుపాయాలపై బృందం కీలక సూచనలు చేసింది. ఐదు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రభుత్వ రంగ సలహా సంస్థ సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకోవడంలో ఎంపీ కేశినేని కీలక పాత్ర పోషించారని బృందం అభిప్రాయపడింది. ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


