AP | దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు మరింత సౌకర్యం..

AP | దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు మరింత సౌకర్యం..

  • వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక వాహనం..
  • ఇంద్రకీలాద్రికి ఎస్‌బీఐ బ్యాటరీ వాహనం విరాళం..
  • రూ.9.13 లక్షల విలువైన వాహనం ప్రారంభం..

AP | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలో బ్యాటరీ వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.9.13 లక్షల విలువైన ఈ వాహనాన్ని బుధవారం ఇంద్రకీలాద్రిపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శీనా నాయకులు కలిసి అప్పగించారు. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి విచ్చేసిన ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు సెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాటరీ వాహనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్ పటేల్, ఇతర జనరల్ మేనేజర్లు, గాంధీనగర్ బ్రాంచ్ మేనేజర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ ఈ వాహనాన్ని స్వీకరించారు. ప్రస్తుత ఈఓ సీనా నాయక్ పదవీకాలంలో భక్తుల సౌకర్యాల కోసం బ్యాటరీ వాహనాల సమీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి రెండు వాహనాలు, కెనరా బ్యాంక్ నుంచి రెండు వాహనాలు విరాళంగా అందగా, తాజాగా ఎస్‌బీఐ నుంచి మరో వాహనం చేరడంతో మొత్తం ఐదు బ్యాటరీ వాహనాలు భక్తుల సేవలోకి వచ్చాయి. ఈ బ్యాటరీ వాహనాల ద్వారా ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగులకు కొండపైకి చేరడం సులభతరం అయింది. నడవలేని స్థితిలో ఉన్న భక్తులకు ఇది పెద్ద ఊరటగా మారింది.

ఘాట్ రోడ్డుపై ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గడంతో ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఇవి దోహదపడుతున్నాయి. వీవీఐపీలను ఈ వాహనాల్లో పంపడం ద్వారా సాధారణ వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడుతోంది. భక్తుల సౌకర్యార్థం దాతలను సమన్వయం చేసుకుంటూ ఆలయ అభివృద్ధికి, యాత్రికుల కష్టాలను తగ్గించేందుకు ఈఓ సీనా నాయక్ తీసుకుంటున్న చర్యలను భక్తులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణహిత బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కొండపై ప్రయాణం మరింత సులభంగా మారిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply