
AP | విద్యార్థి నేతల కిడ్నప్ పై కలకలం…
AP | విద్యార్థి నేతల కిడ్నప్ పై కలకలం…
- మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై తక్షణ చర్యలు తీసుకోవాలి
- ఫీజుల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
AP | విజయవాడ, ఆంధ్రప్రభ : మోహన్ బాబు విశ్వవిద్యాలయ యాజమాన్యం వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీని నిరసిస్తూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలను విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది అపహరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శితో పాటు మరో విద్యార్థి నేతను మార్గమధ్యంలో అడ్డగించి బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు.
విద్యార్థి నేతలపై దౌర్జన్యాలకు పాల్పడటం, భద్రతా సిబ్బందితో భయాందోళన సృష్టించడం దుర్మార్గమైన చర్యగా గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర రాజకీయ విమర్శల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, ప్రైవేట్ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఫీజుల దోపిడీ, అక్రమాలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థి నేతలను తక్షణమే గుర్తించి భద్రతా సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నాయకులకు ఏమైనా ప్రాణహాని జరిగితే దానికి విశ్వవిద్యాలయ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించి, ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
