కావేరీ డ్రైవర్ల మరో హిట్ అండ్ రన్ కథ
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో బైక్ ను బస్సు ఢీకొట్టలేదని.. బస్సు అక్కడికి రాక ముందే బైక్ యాక్సిడెంట్ అయిందని కావేరీ ట్రావెల్స్ డ్రైవర్లు పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. రోడ్ పై బైక్ పడి ఉందని.. భారీ వర్షం కారణంగా సరిగ్గా చూసుకోలేదని.. ఆ సమయంలో బైక్ పైకి బస్సు ఎక్కిందని.. ఈడ్చుకుని వెళ్లిందన్నారు. బైక్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి స్పార్క్ వచ్చి మంటలు అంటున్నాయని డ్రైవర్లు తెలిపారు.
డ్రైవర్లు మిరియాల లక్ష్మయ్య, శివన్నారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ బైక్ యాక్సిడెంట్ అంతకు ముందు జరిగింది. కానీ ఆ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో బైక్ నడిపిన శివకుమార్ రోడ్డు పక్కన పడిపోయారు. బైక్ రోడ్డు మీద పడిపోయింది. ఆ బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. బైక్ రైడర్ కూడా మరణించడంతో పోలీసులు అసలేం జరిగిందన్నదాని పై పూర్తి వివరాలు వెలికి తీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల్ని ప్రమాద స్థలానికి పంపించి.. సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. బస్సులో ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు గాయపడిన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. కోలుకున్న వారిని బెంగళూరుకు పంపే ఏర్పాట్లు చేశారు. బస్సులో ఉండిపోయిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కోసం డీఎన్ఏలు సేకరించారు. ఆ మృతదేహాల ఆనవాళ్లను ఆస్పత్రికి తరలించారు. బస్సును రోడ్డు నుంచి పక్కకు జరిపే ప్రయత్నంలోనూ మరో ప్రమాదం జరిగింది. బస్సును లాగుతున్న క్రేన్ ఒక్క సారిగా కిందకు పడిపోవడంతో.. క్రేన్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

