మ‌ళ్లీ పేలిన తూటా..

  • ముగ్గురు మావోయిస్టుల మృతి..
  • వారిపై రూ.14 ల‌క్ష‌ల రివార్డు
  • మృత‌దేహాల స్వాధీనం చేసుకున్న భ‌ద్ర‌తా ద‌ళాలు

రాయ్‌పూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఛత్తీస్‌గఢ్ అడ‌వుల్లో మ‌రోసారి తూటాలు పేలాయి. కాంకేర్ జిల్లాలో ఈరోజు భ‌ద్ర‌తా ద‌ళాల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. కాగా, ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మ‌ర‌ణించారు. ఈ మేర‌కు ఆ వివ‌రాల‌ను ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి వెల్ల‌డించారు.

కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని చిండ్‌ఖడక్ గ్రామం సమీపంలోని అటవీ కొండపై మావోయిస్టులు ఉన్నార‌ని స‌మాచారం మేర‌కు కూంబింగ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఉదయం భద్రతా సిబ్బంది ఉమ్మడిగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరారని కాంకేర్ పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా తెలిపారు.

కాంకేర్, గరియాబంద్ నుండి రాష్ట్ర పోలీసు యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో నిర్వ‌హిస్తుండ‌గా మావోయిస్టులు తారాస ప‌డ్డారు. దీంతో వారి మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నారు.

కాల్పులు జ‌రిగిన చోట ఒక మ‌హిళ‌తోపాటు ముగ్గురు మావోయిస్టుల మృత‌దేహాలు ఉన్న‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాలు గుర్తించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఘ‌ట‌న స్థ‌లం వ‌ద్ద సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), 303 రైఫిల్, 12-బోర్ గన్, మావోయిస్టు సంబంధిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.

మృతులను మావోయిస్టుల సీతానది, రావాస్ ఏరియా కమిటీ కార్యదర్శి సర్వన్‌ మద్కం అలియాస్‌ విశ్వనాథ్ (ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డు), నగరి ఏరియా కమిటీ ఏరియా కమిటీ సభ్యుడు రాజేష్‌ అలియాస్‌ రాకేష్‌ హేమ్లా (ఐదు ల‌క్షల‌ రూపాయ‌ల రివార్డు), రక్షణ బృందం మెయిన్‌పూర్‌-నువాపాడ సభ్యుడు బసంతి కుంక్‌జం అలియాస్‌ హిడ్మే(ల‌క్ష రూపాయ‌లు రివార్డు)గా గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply